పద్మశ్రీ అవార్డు గ్రహీత రోహిణి గాడ్‌బోలే కన్నుమూత
ప్రఖ్యాత సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత రోహిణి గాడ్‌బోలే కన్నుమూశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2024 4:22 AM GMTప్రఖ్యాత సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత రోహిణి గాడ్‌బోలే కన్నుమూశారు. ప్రకృతికి సంబంధించిన ప్రాథమిక బిల్డింగ్ బ్లాకుల అవగాహనను విస్తరించడంలో ఆమె చేసిన కృషి ఎనలేనిది. శుక్రవారం ఆమె నిద్రలోనే మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. “రోహిణి గాడ్‌బోలే జీ మరణించడం బాధ కలిగించింది. ఆమె ఒక మార్గదర్శక శాస్త్రవేత్త, ఆవిష్కర్త, ప్రపంచంలో మహిళలు రావాలంటూ బలంగా కృషి చేసింది. ఆమె విద్యాపరమైన కృషి రాబోయే తరాలకు మార్గదర్శకంగా కొనసాగుతుంది. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
పద్మశ్రీ గ్రహీత, గాడ్‌బోలే బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని సెంటర్ ఫర్ హై ఎనర్జీ ఫిజిక్స్‌తో 25 సంవత్సరాలకు పైగా అనుబంధం కలిగి ఉన్నారు. 1952లో పూణేలో జన్మించిన గాడ్‌బోలే పూణే విశ్వవిద్యాలయం నుండి తన BSc (భౌతికశాస్త్రం) పూర్తి చేశారు. ఆమె 1974లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే నుండి MSc పూర్తి చేసి, ఇన్‌స్టిట్యూట్ రజత పతకాన్ని అందుకున్నారు. గాడ్‌బోలే 1979లో న్యూయార్క్‌లోని స్టోనీ బ్రూక్ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పూర్తి చేశారు. ప్రొఫెసర్ గాడ్‌బోలే 1995లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ సైన్స్ లో చేరారు. 2018లో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఆమెకు పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. ఫ్రాన్స్ నుండి ఆర్డర్ నేషనల్ డు మెరైట్‌తో సహా అనేక ప్రశంసలు, అవార్డులను గెలుచుకున్నారు.