సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) గత నెల బెంగుళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలో సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి వికాస్ కుమార్ వికాస్‌పై కర్ణాటక ప్రభుత్వం సస్పెన్షన్ ఆర్డర్‌ను పక్కన పెట్టింది. జూన్ 4న ఎం చిన్నస్వామి స్టేడియం ముందు జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ప్లానింగ్, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బాధ్యత వహించాలని CAT పేర్కొంది.
జూన్ 4న బెంగుళూరులో గుమిగూడిన భారీ జనసమూహానికి ప్రాథమికంగా RCB క్రికెట్ జట్టు బాధ్యత వహిస్తుందని CAT తెలిపింది. తొక్కిసలాటలో 11 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. స్టేడియం వద్ద మోహరించిన పోలీసులను క్యాట్ సమర్థించింది. పోలీసులు మాంత్రికులో లేదా దేవుళ్లో కాదని పేర్కొంది.
ట్రిబ్యునల్ తన వ్యాఖ్యలలో.. 'సుమారు మూడు నుండి ఐదు లక్షల మంది రద్దీకి RCB బాధ్యత వహిస్తున్నట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది. RCB పోలీసుల నుండి సరైన అనుమతి లేదా సమ్మతి తీసుకోలేదు. అకస్మాత్తుగా వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. ఆ సమాచారం ఫలితంగా ప్రజలు గుమిగూడారని పేర్కొంది.
ఆర్‌సిబి చివరి నిమిషంలో వేడుకను ప్రకటించడాన్ని ధర్మాసనం విమర్శించింది. 'అకస్మాత్తుగా, ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఆర్‌సిబి గందరగోళాన్ని సృష్టించింది. పోలీసు చట్టం లేదా ఇతర నిబంధనల ప్రకారం.. అవసరమైన అన్ని ఏర్పాట్లను పోలీసులు 12 గంటలలోపు చేస్తారని ఆశించలేమని పేర్కొంది.
ఐపీఎల్ ఫ్రాంచైజీ తమ మొదటి ఐపీఎల్ టైటిల్ గెలిచిన మరుసటి రోజు జూన్ 4న విజయోత్సవ పరేడ్ వేడుక గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పోలీసుల పాత్రను కూడా ధర్మాసనం సమర్థిస్తూ.. 'పోలీసు సిబ్బంది కూడా మనుషులే.. వారు 'దేవుళ్లు' కాదు, మాంత్రికులు కాదు, ఏ కోరికనైనా తీర్చగల 'అల్లాదీన్ దీపం' వంటి అద్భుత శక్తులు వారికి లేవు అని వ్యాఖ్యానించింది.