ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇంకొద్ది రోజులు మారటోరియం పొడిగింపు..!
RBI allows fresh moratorium for some small borrowers amid Covid-19 crisis.గత రెండేళ్లుగా మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్లపాటు మారటోరియం సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు.
By Medi Samrat
కరోనా మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆర్బీఐ కూడా తన వంతు ప్రయత్నాలను మొదలుపెడుతూ ఉంది. సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు దేశ బ్యాంకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కరోనా కారణంగా నష్టపోయిన వారిని ఆదుకుంటామని అన్నారు. గత రెండేళ్లుగా మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్లపాటు మారటోరియం సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలతోపాటు అసంఘటిత రంగ సంస్థలకు మరింత సహకారం అందిస్తామని శక్తికాంతదాస్ భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి వరకు కొవిడ్ సంబంధిత మౌలిక వసతుల కోసం రూ. 50 వేల కోట్ల కేటాయింపులు చేస్తామన్నారు. చిన్న తరహా ఫైనాన్స్ బ్యాంకుల కోసం ప్రస్తుత రెపో రేటుకు రూ. 10 వేల కోట్లు, రుణ గ్రహీతలకు రూ. 10 లక్షల వరకు తాజా రుణాలు అందిస్తామన్నారు. ఈ ఏడాది అక్టోబరు 31 వరకు ఈ సదుపాయం అందిస్తామన్నారు.
ఏడాది పాటూ, ద్రవ్యోల్బణాన్ని స్థానిక లాక్ డౌన్ లు, కరోనా వ్యాప్తి ప్రభావితం చేయనున్నాయని.. పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వ వర్గాలన్నీ కృషి చేయాలని అన్నారు. నిన్న మొన్నటి వరకూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో కనిపించిన వేళ, భారత్ బలంగా ఉందని, ఇప్పుడు భారత్ పరిస్థితి మారిపోయిందని ఆయన అన్నారు. ఈ మహమ్మారి నుంచి భారతావని బయట పడుతుందన్న నమ్మకం ఉందని శక్తికాంత దాస్ అన్నారు. ఇదే సమయంలో ఏప్రిల్ లో జరిగిన మధ్యంతర పరపతి సమీక్షలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా తామేమీ సంచలన నిర్ణయాలు తీసుకోవాలని భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు.
రుణ అవసరాల నిమిత్తం చూసేవారికి సులువుగా రుణాలను అందించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉండాలని, ముఖ్యంగా ప్రాధాన్యతా అవసరాలను బట్టి రుణాలను అందించాలని శక్తికాంత దాస్ బ్యాంకులను కోరారు. గతంలో రెండు సంవత్సరాల పాటు మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్ల మారటోరియంను ప్రకటిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. భారత భవిష్యత్తు ప్రస్తుతం అనిశ్చితిలో ఉందని, దాన్ని తొలగించేందుకు కొన్ని తక్షణ చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇండియా తరఫున విదేశీ మారక ద్రవ్య నిల్వలు ప్రస్తుతం 588 బిలియన్ డాలర్లు ఉన్నాయని, అదే దేశాన్ని కరోనా నుంచి కాపాడుతుందన్న నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.