అది పోలీసు గోదాం.. అందులో తనిఖీల సమయంలో పట్టుబడిన మద్యం బాటిళ్లను, గంజాయిని నిల్వ ఉంచుతుంటారు. అయితే ఆ గోదాంను ఎలుకలు టార్గెట్ చేశాయి. గోదాంలో ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లను చీల్చి మద్యాన్ని ఖాళీ చేశాయి. ఈ విచిత్రమైన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలుకలు పోలీసు గోదాములో నిల్వ చేసిన అనేక స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను ఖాళీ చేశాయి. ఎలుకలు ప్లాస్టిక్ బాటిళ్లను చీల్చడంతో మద్యం బయటకు వచ్చింది. దాదాపు 60 నుంచి 65 చిన్న ప్లాస్టిక్ బాటిళ్లు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు.
ప్రతిగా, పోలీసులు ఒక ఎలుకను పట్టుకుని బోనులో ఉంచారు. ఇది ఒక్కటేమీ కాదని పోలీసు అధికారి తెలిపారు. పోలీస్ స్టేషన్ భవనం చాలా పాతదని, జప్తు చేసిన వస్తువులు నిల్వ ఉంచిన గోదాము ఎలుకల ఆటలాడుగా మారిందని వివరించారు. పట్టుబడిన గంజాయిని కూడా ఎలుకలు టార్గెట్ చేశాయని, వాటిని నిల్వ ఉంచిన బస్తాలను కొరుకుతూ ఉంటాయని ఆయన తెలిపారు. దీన్ని అడ్డుకునేందుకు పోలీసులు గంజాయిని ఐరన్ టిన్ బాక్సుల్లో భద్రపరిచారు.
ఎలుకలు స్వాధీనం చేసుకున్న వస్తువులకు నష్టం కలిగించడమే కాకుండా ముఖ్యమైన పత్రాలకు కూడా ముప్పు కలిగిస్తున్నాయి. పెద్దఎత్తున నష్టం జరగకుండా పోలీసులు ఫైళ్లను ఎలుకలకు అందకుండా వేర్వేరుగా, ఎత్తులో భద్రపరిచేందుకు చర్యలు చేపట్టారు.