యూపీ శాసనసభలో అరుదైన ఘట్టం.. ప్రత్యర్థులిద్ద‌రూ కరచాలనం చేసుకున్నారు

Rare moment of bonhomie between CM Yogi and rival Akhilesh Yadav in UP Assembly. ఉత్తరప్రదేశ్ శాసనసభలో సోమవారం అరుదైన ఘట్టం చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  28 March 2022 10:18 AM GMT
యూపీ శాసనసభలో అరుదైన ఘట్టం.. ప్రత్యర్థులిద్ద‌రూ కరచాలనం చేసుకున్నారు

ఉత్తరప్రదేశ్ శాసనసభలో సోమవారం అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఒకరితో ఒకరు కరచాలనం చేసుకున్నారు. ఆదిత్యనాథ్, అఖిలేష్ భుజంపై చేయి వేస్తూ సంభాషించారు. ఈ వీడియోను ప్ర‌ముఖ‌ వార్తా సంస్థ ANI తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. సిఎం యోగి, అఖిలేష్‌లను బద్ధ‌ ప్రత్యర్థులుగా పేర్కొంటారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇద్దరూ వివిధ సందర్భాలలో ఒకరినొకరు దూషించుకున్నారు. ఇద్దరూ ఎన్నికల్లో ఒకరినొకరు ఓడించాలని పేర్కొన్నారు.

అయితే యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బిజెపి 403 స్థానాల‌లో 250 సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా వరుసగా రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు ఎస్పీ 125 సీట్లు గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యులుగా ఆదిత్యనాథ్, అఖిలేష్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష నేతగా అఖిలేష్‌ను ఎంపిక చేశారు. ప్రొటెం స్పీకర్ రమాపతి శాస్త్రి సభలో సభ్యులతో ప్రమాణం చేయించారు. శుక్రవారం లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు 18 మంది కేబినెట్ మంత్రులు, 14 మంది రాష్ట్ర మంత్రులు (స్వతంత్ర బాధ్యతలు), 20 మంది ఇతర రాష్ట్ర మంత్రులు ప్రమాణం చేశారు.










Next Story