రంగులు మారుస్తూ ఎగిరే బల్లిని ఎప్పుడైనా చూసారా..?

Rare Draco Volans Flying Lizard Found In Uttarakhand. అదేంటి రంగులు మార్చేది ఊసరవెల్లి కదా.! బల్లి రంగులు మార్చడం ఏమిటి

By Medi Samrat  Published on  24 Jan 2021 3:09 AM GMT
flying Lizard

అదేంటి రంగులు మార్చేది ఊసరవెల్లి కదా.! బల్లి రంగులు మార్చడం ఏమిటి అనుకుంటున్నారా? అవును కేవలం ఊసరవెల్లి కాకుండా రంగులు మార్చే బల్లులు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ఇది కేవలం రంగులు మార్చే బల్లి మాత్రమే కాదు, పక్షులు మాదిరి ఎగరగలదు. ఈ విధమైన రంగులు మార్చే, ఎగిరే బల్లులు చాలా అరుదుగా కనిపిస్తాయి. అలాంటి అరుదైన బల్లి ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో కనిపించింది. ప్రస్తుతం ఈ బల్లి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ బల్లి గురించి అధికారులు ఏం చెబుతున్నారంటే...

సాధారణంగా బల్లులు గోడలపై పాకుతూ వెళ్లడం మనం చూసే ఉంటాం. కానీ ఎగిరే బల్లులను మనం చూడడం చాలా అరుదు. అలాంటి బల్లి ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని రైతు పొలంలో కనువిందు చేసింది."డ్రాకో వొలాన్స్‌" అనే అరుదైన జాతికి చెందిన ఈ బల్లి ముందు కాళ్ళ నుంచి వెనుక కాళ్ళ వరకు రెక్కలు విస్తరించి ఉన్నాయి. అంతేకాకుండా చిన్న చిన్న కాళ్ళతో పాటు పెద్ద తోక కూడా ఉంది. ఈ బల్లి ఒక చెట్టు నుంచి మరొక చెట్టు పైకి పక్షుల్లాగా ఎగురుతూ కనువిందు చేసింది.

ఈ బల్లి ఒకచోట నుంచి మరొక చోటుకు దాదాపు వంద మీటర్లు వరకు ఎగరగలదని అటవీ అధికారులు తెలియజేశారు. ఈ బల్లి కేవలం పక్షుల్లాగా ఎగరడమే కాకుండా, ఏ చెట్టు పై కూర్చుంటే ఆ చెట్టు ఆకుల రంగులోకి మారిపోతుంది. ఇలాంటి అరుదైన బల్లులు కేవలం పశ్చిమ కనుమలు, దక్షిణాసియాలోనే కనిపిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఈ బల్లులు ఉత్తరాఖండ్ లో కనిపించి కనువిందు చేసింది. ఈ ఎగిరే బల్లిని అధికారులు లోకేష్‌ పూజారీ సంతగల్‌ అటవీ అధికారులకు అప్పగించాడు.
Next Story
Share it