అత్యాచారం కేసులో ఆశారాం బాపుకు ఉపశమనం

2013 అత్యాచారం కేసులో ఆశారాం బాపుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

By Medi Samrat  Published on  7 Jan 2025 2:19 PM IST
అత్యాచారం కేసులో ఆశారాం బాపుకు ఉపశమనం

2013 అత్యాచారం కేసులో ఆశారాం బాపుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైద్య కారణాలతో ఆయనకు ఈ బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, ఈ సమయంలో తన మద్దతుదారులను కలవడానికి కోర్టు అతనికి అనుమతి ఇవ్వ‌లేదు. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఆశారాం ప్రయత్నించకూడ‌ద‌ని, మద్దతుదారులెవరినీ కలవకూడ‌ద‌ని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

86 ఏళ్ల ఆశారాం గుండె జబ్బులతో పాటు వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని కోర్టు పేర్కొంది. 2023లో గాంధీనగర్ కోర్టు విధించిన జీవిత ఖైదుపై ఆశారాం సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. వైద్యపరమైన కారణాలపై మాత్రమే కేసును పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. అంతకుముందు ఆగస్టు 29, 2024న గుజరాత్ హైకోర్టు ఆశారాం పిటిషన్‌ను తిరస్కరించింది.

2013 కేసులో శిక్ష

2023 జనవరిలో ట్రయల్ కోర్టు ఆశారాంను దోషిగా నిర్ధారించింది. ఆయ‌న‌పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆయ‌న‌ మరో అత్యాచారం కేసులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలులో ఉన్నాడు.

ఆశారాం కుమారుడు నారాయణ్ సాయి కూడా లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2019లో సూరత్ కోర్టు నారాయణ్ సాయిని అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది.

Next Story