లైంగిక వేధింపుల కేసు.. జూన్ 6 వరకు సిట్ కస్టడీకి ప్రజ్వల్ రేవణ్ణ

సస్పెన్షన్‌కు గురైన జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు కోర్టు జూన్ 6 వరకు సిట్ కస్టడీకి పంపింది. లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణ గురువారం రాత్రి జర్మనీ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు

By Medi Samrat  Published on  31 May 2024 12:11 PM GMT
లైంగిక వేధింపుల కేసు.. జూన్ 6 వరకు సిట్ కస్టడీకి ప్రజ్వల్ రేవణ్ణ

సస్పెన్షన్‌కు గురైన జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు కోర్టు జూన్ 6 వరకు సిట్ కస్టడీకి పంపింది. లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణ గురువారం రాత్రి జర్మనీ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న సిట్.. రాత్రి అతడిని అరెస్ట్ చేసింది. అరెస్టు చేసిన అనంతరం శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన రేవణ్ణను బెంగళూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. తన ఇంట్లో పనిచేసే మహిళ ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపు ఆరోపణలపై ప్రజ్వల్ రేవణ్ణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

దేశం విడిచి పారిపోయిన రేవ‌ణ్ణ‌.. ఒక నెల తర్వాత జర్మనీలోని బెర్లిన్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు. బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న రేవణ్ణను కర్ణాటక ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అదుపులోకి తీసుకుంది. రేవణ్ణ విమానాశ్రయానికి రాకముందే బెంగళూరులోని సీఐడీ కార్యాలయం వెలుపల భద్రతను కట్టుదిట్టం చేసి.. కార్యాలయం వెలుపల బారికేడ్లు ఏర్పాటు చేశారు.

మే 31న సిట్ ఎదుట విచారణకు హాజరవుతానని.. మే 27న విడుదల చేసిన సెల్ఫ్ మేడ్ వీడియోలో ప్రజ్వల్ రేవణ్ణ తెలిపారు. ఏప్రిల్ 26న కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికలకు ఓటు వేయడానికి వెళ్లినప్పుడు తనపై ఎలాంటి కేసు లేదన్న రేవణ్ణ.. తన పర్యటనను ముందే ప్లాన్ చేసుకున్నాన‌ని చెప్పారు. "రాజకీయాల్లో దూసుకెళ్తున్నందున" తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

ఈ నెల 29న రేవణ్ణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు ప్రధాన నిందితులను సిట్ అరెస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు చేసిన వారిని నవీన్ గౌడ, చేతన్‌గా గుర్తించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

ఐపీసీ సెక్షన్లు 64(ఏ), 365, 109, 120(బీ) కింద నమోదైన కేసులో విచారణ నిమిత్తం సస్పెండ్ అయిన జేడీ(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. జూన్ 1న హోలెనరసీపూర్‌లోని కార్యాల‌యానికి హాజరు కావాలని సిట్‌ ఆదేశించింది.

Next Story