కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తూ ఉంది. భారత్ లో కూడా వ్యాక్సిన్ల అవసరం ఉంది. 2021 జనవరికల్లా దేశీయంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఆశాభావం వ్యక్తం చేశారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్, భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ లు అందుబాటులోకి వస్తాయని అన్నారు. వీటిని ఎమర్జెన్సీ ప్రాతిపదికన ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) జనవరికల్లా అనుమతించవచ్చని రణదీప్ అంచనా వేశారు. మూడో దశ క్లినికల్ పరీక్షలలో ఉన్న వ్యాక్సిన్లకు ఇందుకు అవకాశమున్నట్లు తెలియజేశారు.
ఇటీవల యూకే ప్రభుత్వం అత్యవసర వినియోగానికి ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు దేశాలు ఈ బాటను అనుసరించే వీలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయంగా మూడో దశ క్లినికల్ పరీక్షలను పూర్తిచేసుకున్నాక వ్యాక్సిన్ పనితీరుపై డేటా ఆధారంగా ఔషధ నియంత్రణ సంస్థ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతించే అవకాశాలు ఉన్నాయి. ఆయా కంపెనీలు వ్యాక్సిన్లపై పరీక్షల పూర్తి డేటాను అందజేసిన తర్వాతనే వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.