వేదిక‌పై పంది కడుపు చీల్చి మాంసాన్ని తిన్న యాక్ట‌ర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

రామాయణంలో రాక్షస పాత్ర పోషిస్తున్న 45 ఏళ్ల థియేటర్ యాక్టర్‌ని ఒడిశాలోని గంజాం జిల్లాలో అరెస్టు చేశారు.

By Kalasani Durgapraveen  Published on  3 Dec 2024 10:52 AM IST
వేదిక‌పై పంది కడుపు చీల్చి మాంసాన్ని తిన్న యాక్ట‌ర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

రామాయణంలో రాక్షస పాత్ర పోషిస్తున్న 45 ఏళ్ల థియేటర్ యాక్టర్‌ని ఒడిశాలోని గంజాం జిల్లాలో అరెస్టు చేశారు. వేదికపై పంది కడుపు చీల్చి మాంసాన్ని తిన‌డంతో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగడంతో సోమవారం అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనను అసెంబ్లీలో అధికార బీజేపీ సభ్యులు బాబు సింగ్, సనాతన్ బిజులీ తీవ్రంగా ఖండించారు.

నవంబర్ 24న హింజిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాలాబ్ గ్రామంలో జరిగిన నాటకంలో ఒక వ్య‌క్తి పంది క‌డుపు చీల్చినట్లు పోలీసులు గుర్తించారు. జంతువుల పట్ల క్రూరత్వం, వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు అత‌డిని అరెస్టు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. జంతు హక్కుల కార్యకర్తలు కూడా దీనిని ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

“థియేటర్‌లో పాములను ప్రదర్శించిన వ్యక్తుల కోసం కూడా మేము వెతుకుతున్నాము. వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తాం’’ అని బెర్హంపూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌ఓ) సన్నీ ఖోకర్ తెలిపారు. అయితే అరెస్టయిన ఆర్గనైజర్ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు.

రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో జారీ చేసిన మార్గదర్శకాల‌లో సర్టిఫైడ్ పాము హ్యాండ్లర్‌లతో సహా పాములను బహిరంగంగా ప్రదర్శించడాన్ని నిషేధించింది.

ఇదిలావుంటే.. థియేటర్‌లో పందిని చంపి మాంసాన్ని తిన్న థియేటర్ యాక్టర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని హింజిలి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ సేథీ తెలిపారు. ప్రేక్షకులను ఆకర్షించేందుకు థియేటర్ గ్రూప్ పాములను ప్రదర్శిస్తున్నారు.. అయితే.. ఒక దెయ్యం బతికి ఉన్న పంది కడుపుని కత్తితో చీల్చివేసిందని న‌మ్మిస్తూ.. పందిని వేదిక పైకప్పుకు కట్టి, కొన్ని అవయవాలను పూర్తిగా ప్రజల ముందు తినేశాడని ఇన్‌స్పెక్టర్ చెప్పారు. గ్రామంలో కంజియానల్ యాత్ర సందర్భంగా గ్రామస్తుల బృందం నాట‌కాన్ని ఏర్పాటు చేశారు.

Next Story