ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే ఆయన చుట్టూ పటిష్ఠ భద్రత ఉంటుంది. సెక్యూరిటీ దాటుకుని ఆయన దగ్గరకు వెళ్లడం కష్టం. ఎమ్మెల్యే ఇంటి ముందు పోలీసులు పహారా కాస్తుంటారు. సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుంది. అయితే.. అవేవి ఆ దొంగలకు అడ్డురాలేదు. తాజాగా ఓ ఎమ్మెల్యే ఇంటికి కన్నం వేసి.. ఆయన కారును మాయం చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ ఎమ్మెల్యే నారాయన్ బెనివాల్‌కు చెందిన ఎస్‌యూవీ కారు.. ఆయన నివాసం ఉంటున్న ఇంటి నుంచి చోరీకి గురైంది.
''ఎమ్మెల్యే బేనివాల్ తన స్కార్పియో వాహనాన్ని గత రాత్రి ఇంటి వెలుపల పార్క్ చేశాడు. ఈ ఉదయం వాహనం కనిపించలేదు'' అని ఎస్‌హెచ్‌వో శ్యామ్ నగర్ శ్రీమోహన్ మీనా తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, వివేక్ విహార్, పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీల ఫుటేజీలను పరిశీలిస్తున్నామని చెప్పారు.
''నేను మామూలుగా వివేక్ విహార్ ప్రాంతంలోని ఇంటి వెలుపల వాహనాన్ని పార్క్ చేస్తాను. ఈ ఉదయం బయటకు వచ్చేసరికి వాహనం కనిపించలేదు'' అని ఎమ్మెల్యే బేనీవాల్ తెలిపారు. ''దొంగలకు పోలీసులంటే భయం లేదు. ఒక ఎమ్మెల్యే వాహనం ఈవిధంగా చోరీకి గురవుతుందా? ఒక సాధారణ పౌరుడి పరిస్థితేంటి? సాధారణ ప్రజలను పోలీసులు తనిఖీలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తారు. కానీ దొంగలు దర్జాగా తిరుగుతున్నారు.'' అని ఎమ్మెల్యే బెనివాల్ ఆరోపించారు.