రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్
రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. కాంగ్రెస్ అభ్యర్థి మృతితో కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి.
By Medi Samrat Published on 25 Nov 2023 9:24 AM ISTరాజస్థాన్‌లో 199 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. కాంగ్రెస్ అభ్యర్థి మృతితో కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. 199 అసెంబ్లీ స్థానాలకు 1,863 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వీరి భవితవ్యాన్ని 5 కోట్ల 25 లక్షల 38 వేల 105 మంది ఓటర్లు తేల్చనున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ సీఎం వసుంధర రాజే, కీలక నేతలు సచిన్ పైలట్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, దియా కుమారితో సహా అనేక మంది అనుభవజ్ఞులైన నాయకులు ఎన్నికల బరిలో ఉన్నారు.
కేంద్ర మంత్రి, బీజేపీ నేత గజేంద్ర సింగ్ షెకావత్ కుటుంబ సమేతంగా జోధ్‌పూర్‌లో ఓటు వేశారు. గజేంద్ర సింగ్ షెకావత్ విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ భారీ మెజారిటీతో ప్రభుత్వంలోకి వస్తోందన్నారు. ఈసారి ఓటు వేసేముందు ప్రజలు.. ఐదేళ్లలో తాము పడిన కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఓటు వేస్తారని అన్నారు. 100 శాతం ప్రజలు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీ ఎంపీ, జోత్వారా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి రాజ్యవర్ధన్ రాథోడ్ జైపూర్‌లోని పోలింగ్ బూత్‌కు చేరుకుని ఓటు వేశారు. అనంతరం ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలని ఓటర్లందరినీ కోరుతున్నాను. మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఈ పండుగ మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ తదుపరి ఐదు సంవత్సరాలను నిర్ణయిస్తుందన్నారు.
కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ.. ఈసారి ట్రెండ్ మారుతుందని.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మరో అవకాశం వస్తుందని.. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తుందని నమ్ముతున్నాను.. పనిచేసే వారికే మనం ఓటు వేయాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఇదిలావుంటే.. టోంక్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఈ స్థానం నుంచి సచిన్ పైలట్ భారీ మెజార్టీతో గెలుపొందారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ.. మొత్తం 1,71,000 మంది పోలీసులను మోహరించినట్లు వెల్లడించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద 26,000 మందికి పైగా వెబ్‌కాస్టింగ్ లో పాల్గొన్నట్లు తెలిపారు. ఏరియా మేజిస్ట్రేట్, పోలీసు బృందం, క్విక్ రెస్పాన్స్ టీమ్ హాజరయ్యారని వివరించారు.