భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, ప్రముఖ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి భారత సైన్యానికి తన మద్దతును తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న పౌరులకు బలమైన సందేశాన్ని పంపుతూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దర్శకుడు రాజమౌళి సాయుధ దళాల ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ, ఇలాంటి సమయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలను కోరారు.
భారత సైనిక దళాల కదలికలు ఎక్కడైనా గమనిస్తే, వాటిని ఫోటోలు తీయడం లేదా వీడియోలు చిత్రీకరించడం చేయవద్దని కోరారు. అటువంటి సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా, మనకు తెలియకుండానే శత్రువులకు సహాయం చేసినవారమవుతామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా వార్త లేదా సమాచారం కనిపిస్తే, దానిని గుడ్డిగా నమ్మి ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని సూచించారు. ధృవీకరించని వార్తలను వ్యాప్తి చేయడం వల్ల అనవసరమైన గందరగోళం, ఆందోళన చెలరేగుతాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, ప్రశాంతంగా ఉండాలని రాజమౌళి పిలుపునిచ్చారు. అంతిమంగా విజయం మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.