పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. గురువారం సాయంత్రం జల్‌పాయ్‌గుడి జిల్లా దోహొమోనీ వద్ద గువాహటి-బికనేర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి 12 బోగీలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందగా.. మరో 70 మందికి పైగా గాయపడినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రమాద స్థలాన్ని ఈరోజు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్యం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైలు ప్రమాద ఘటనపై చట్టబద్ధమైన విచారణ ప్రారంభించామన్నారు. ప్రధాని మోదీ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25వేల చొప్పున్న ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై అధికారులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. లోకోమోటివ్ పరికరాల్లో ఏర్పడ్డ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రమాదానికి మూల కారణం ఏమిటన్నదానిపై కూడా లోతుగా విచారణ చేపట్టారు.