రాహుల్ గాంధీ 'భారత్ న్యాయ్ యాత్ర'.. ఏ రోజు, ఎక్క‌డ నుంచి ప్రారంభం అంటే...

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జనవరి 14 నుంచి భారత్ జోడో యాత్ర రెండో ఎడిషన్‌ను ప్రారంభించనున్నారు.

By Medi Samrat  Published on  27 Dec 2023 10:00 AM GMT
రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర.. ఏ రోజు, ఎక్క‌డ నుంచి ప్రారంభం అంటే...

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జనవరి 14 నుంచి భారత్ జోడో యాత్ర రెండో ఎడిషన్‌ను ప్రారంభించనున్నారు. 'భారత్ న్యాయ్ యాత్ర'గా పేరు మార్చారు. ఈ యాత్ర దేశంలోని తూర్పు నుండి పడమర వరకు సాగుతుంది. ఈశాన్య ప్రాంతంలోని మణిపూర్ నుండి మొదలై పశ్చిమాన మహారాష్ట్రలోని ముంబైలో ముగుస్తుంది. రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రలో 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాలు కవర్ చేయనున్నారు. మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో 6,200 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. జనవరి 14న మణిపూర్ నుంచి పాదయాత్రను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే జెండా ఊపి ప్రారంభించనున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎక్కువగా చేరుకోవాలనే లక్ష్యంతో భారత్ న్యాయ్ యాత్రలో కేవలం పాదయాత్ర మాత్రమే కాకుండా.. బస్సులో కూడా రాహుల్ గాంధీ ప్రయాణం చేయనున్నారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దక్షిణాదిలోని కన్యాకుమారిలో ప్రారంభమై ఉత్తరాన కాశ్మీర్‌లో ముగిసిన భారత్ జోడో యాత్ర ఒక చారిత్రక యాత్ర అని.. ఇప్పుడు, రాహుల్ గాంధీ మరో గొప్ప యాత్రకు శ్రీకారం చుడుతున్నారని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత్ న్యాయ్ యాత్ర చేయనున్నారు. భారతీయ జనతా పార్టీని గద్దె దించాలని.. కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది.

Next Story