ఎప్పుడూ పాలిటిక్స్‌తో బిజీగా ఉండే కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ అరేబియా సముద్రంలో ఈత కొట్టారు. బుధవారం కేరళలో పర్యటించిన ఆయన కొల్లాంలో స్థానిక మత్స్యకారులతో కలిసి సముద్రంలోకి వెళ్లారు. అక్కడ బోటు దిగి నడి సముద్రంలో సరదాగా ఈత కొట్టారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కేరళలోని మత్స్యకారుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి రాహుల్ కొల్లాం తీరంలో బుధవారం పర్యటించారు. వాడి బీచ్ నుంచి మత్స్యకారులతో కలిసి ఆయన సముద్రంలోకి వెళ్లారు. ఓ పడవలో సముద్రంలోకి వెళ్లిన ఆయన చేపలను పట్టేందుకు వల కూడా విసిరారు. మత్స్యకారులతో పాటు సముద్రంలోకి దూకి అందరినీ ఆశ్చర్యపరిచారు.
రాహుల్ దాదాపు పది నిమిషాల పాటు సముద్రంలో ఈత కొట్టారు. రాహుల్ ఈత కొట్టిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పడవ ఒడ్డుకు చేరాక.. థంగస్సెరీ బీచ్ దగ్గర మత్స్యకారులను ఉద్దేశించి రాహుల్ ఉద్వేగ భరితంగా మాట్లాడారు. కేరళ ప్రభుత్వం మత్స్యకారుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. జాలర్లు జీవనోపాధిని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జాలర్లు ఎంత కష్టపడతారో తనకు ఇవాళ అర్థం అయ్యిందని బావోద్వేగానికి లోనయ్యారు.