'ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేరా'.. రాహుల్ గాంధీ ఆన్‌ఫైర్
యూజీసీ-నెట్ రద్దు, నీట్ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు.
By అంజి Published on 20 Jun 2024 5:30 PM IST'ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేరా'.. రాహుల్ గాంధీ ఆన్‌ఫైర్
యూజీసీ-నెట్ రద్దు, నీట్ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ''రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ జీ ఆపారని చెబుతున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల, నరేంద్ర మోడీ భారతదేశంలో పేపర్ లీక్‌లను ఆపలేకపోయారు లేదా ఆపడానికి ఇష్టపడలేదు'' అంటూ ఎద్దేవా చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 18న నిర్వహించిన UGC-NET పరీక్షను కొన్ని కారణాల వల్ల విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం రద్దు చేసింది.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే సైబర్ క్రైమ్ హెచ్చరికల విశ్లేషణ యూనిట్-- ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) యూజీసీ-నెట్ పరీక్ష సమగ్రతకు భంగం(లీకేజీ అనుమానాలు!) వాటిల్లినట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చింది. దీంతో పరీక్షను కేంద్రం రద్దు చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం సీబీఐకి అప్పగించారు. విద్యావ్యవస్థను బీజేపీ మాతృసంస్థ కబ్జా చేసినందుకే పేపర్ లీక్‌లు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
“ఇది రివర్స్ కానంత వరకు, పేపర్ లీక్‌లు కొనసాగుతాయి. మోదీ జీ ఈ కబ్జాను సులభతరం చేశారు. ఇది దేశ వ్యతిరేక చర్య' అని రాహుల్ గాంధీ అన్నారు. యూనివర్శిటీ ఛాన్సలర్‌లను మెరిట్ ఆధారంగా ఎంపిక చేయలేదని, "ఒక నిర్దిష్ట సంస్థ"తో ఉన్న సంబంధం ఆధారంగా ఎంపిక చేశారని కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. ఈ సంస్థ, బిజెపి మన విద్యావ్యవస్థలోకి చొచ్చుకుపోయి విద్యా వ్యవస్థను నాశనం చేశాయి. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థకు నరేంద్ర మోదీ ఏం చేశారో, ఇప్పుడు విద్యావ్యవస్థకు కూడా అదే చేశారు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.