'నా తప్పేంటి?'.. ఆలయ ప్రవేశానికి రాహుల్‌కు అనుమతి నిరాకరణ
సోమవారం నాడు నగావ్ జిల్లాలోని బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు.
By అంజి Published on 22 Jan 2024 11:13 AM IST'నా తప్పేంటి?'.. ఆలయ ప్రవేశానికి రాహుల్‌కు అనుమతి నిరాకరణ
భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం నాడు నగావ్ జిల్లాలోని బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అనుమతించకపోవడానికి గల కారణం ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు ఆలయాల్లోకి ఎవరు వెళ్లాలనేది ప్రధాని మోదీ నిర్ణయిస్తున్నారని రాహుల్ విమర్శలు చేశారు. ఇతర కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సోమవారం అస్సాంలోని నాగోవ్‌లో కింద కూర్చొని ఆందోళనకు దిగారు.
''మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్నాం. ఇక్కడకు రాకూడనంత నేరం నేనేమీ చేశాను..? మేం ఇక్కడకు వచ్చింది ప్రార్థించడానికి.. ఎలాంటి సమస్యలు సృష్టించడానికి కాదు'' అని రాహుల్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ నాయకుడు సోమవారం తన భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించే ముందు స్థానిక దేవతకు పూజలు చేయవలసి ఉంది. దీనికి అనుమతి ఉన్నప్పటికీ తనకు ప్రవేశం నిరాకరించబడిందని ఆయన పేర్కొన్నారు. ఒక వీడియోలో, రాహుల్ గాంధీని ఆపడానికి గల కారణాలపై భద్రతా అధికారిని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఈరోజు వ్యాఖ్యానిస్తూ, "రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లాలనుకున్నారు. జనవరి 11 నుండి మేము ప్రయత్నిస్తున్నాము, మా ఇద్దరు ఎమ్మెల్యేలు దాని కోసం మేనేజ్‌మెంట్‌ను కలిశారు" అని అన్నారు.
"జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు అక్కడికి వస్తామని చెప్పాం. స్వాగతం పలుకుతామని చెప్పారు. కానీ నిన్న సడెన్‌గా మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడికి రాలేమని చెప్పారు" అని రమేష్ తెలిపారు. "ఇది రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఒత్తిడి. మేము అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాము, కాని మధ్యాహ్నం 3 గంటల తర్వాత అక్కడికి వెళ్లడం చాలా కష్టం, ఎందుకంటే మేము అదనపు దూరం వెళ్ళవలసి ఉంటుంది" అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విలేకరులతో అన్నారు. రాహుల్ గాంధీని సోమవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రాంగణంలోకి అనుమతిస్తామని బటద్రవ థాన్ మేనేజ్‌మెంట్ కమిటీ ఆదివారం తెలిపింది .