రైతులతో కలిసి పొలంలో నాట్లు వేసిన రాహుల్‌గాంధీ

హర్యానాలోని సోనిపట్‌లో రాహుల్‌గాంధీ ఓ రైతు పొలంలో నాట్లు వేశారు.

By Srikanth Gundamalla
Published on : 8 July 2023 6:45 AM

Rahul Gandhi, Corp Work, Farmers, congress,

రైతులతో కలిసి పొలంలో నాట్లు వేసిన రాహుల్‌గాంధీ

భారత్‌ జోడో యాత్ర తర్వాత ప్రజల్లో మరింత మమేకం అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రజలకు దగ్గరయ్యేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే రాహుల్‌గాంధీ ఓ రైతు పొలంలో నాట్లు వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాహుల్‌గాంధీ శనివారం హిమాచల్‌ ప్రదేశ్‌కు బయల్దేరారు. మార్గమధ్యంలో హర్యానాలోని సోనిపట్‌లో ఓ పొలం వద్ద ఆగారు. అక్కడే వరి నాట్లు వేస్తున్న రైతుల వద్దకు వెళ్లి కాసేపు ముచ్చటించారు. వారి ఇబ్బందులు, కష్టాలను తెలుసుకున్నారు. అంతటితో ఆగకుండా రైతులతో కలిసి వరినాట్లు వేశారు. ఆ తర్వాత ట్రాక్టర్‌ ఎక్కి పొలాన్ని దున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2024 ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు రాహుల్‌ ఇలా వివిధ వర్గాల ప్రజలను నేరుగా కలుస్తున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు.

రాహుల్‌గాంధీ నేరుగా వెళ్లి ప్రజలను కలవడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల బైక్‌ మెకానిక్‌గా కరోల్‌బాగ్‌ ఏరియాలోని ఓ మెకానిక్‌షాపులో స్క్రూ డ్రైవర్, పానా చేతబట్టి కనిపించారు. అంతకు ముందు లారీ డ్రైవర్లతో కలిసి ప్రయాణం చేశారు. రాత్రంతా ఎవరూ ఊహించని విధంగా ట్రక్కులోనే ప్రయాణం చేశారు. తాజాగా.. హిమాచల్‌ ప్రదేశ్‌లోని షిమ్లాలో ఉంటోన్న సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను కలవడానికి వెళ్తూ రైతులో కలిసి పని చేశారు.

Next Story