అమేథీ మాజీ ఎంపీ స్మృతి ఇరానీపై సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. గెలుపు ఓటములు జీవితంలో భాగమని ఆయన ఎక్స్‌లో చెప్పారు. స్మృతి ఇరానీపై ఎలాంటి అవమానకరమైన పదజాలం ఉపయోగించవద్దని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకరిని అవమానించడం, ఇబ్బంది పెట్టడం బలహీనతకు సంకేతం.. బలంగా ఉండటానికి కాదు. ఇలా చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ మోదీ ప్రభుత్వంలో మొదటి రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీని ఓడించిన తర్వాత ఆమె స్థాయి గణనీయంగా పెరిగింది. అయితే.. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి దగ్గరగా ఉండే కిషోరి లాల్ శర్మ చేతిలో ఆమె ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ కారణంగా కొత్త ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గంలో కూడా చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే స్మృతి ఇరానీ అధికారిక ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయవలసి వచ్చింది. ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాలో దాడికి గురవుతున్నారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ స్పందించారు.