బీజేపీ నాయకుడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ బుధవారం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కు సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు. అందులో రాహుల్ గాంధీ తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని దూరంగా నెట్టడం చూడవచ్చు.
ఈ వీడియోలో, రాహుల్ గాంధీ ఒక వేదికపై నిలబడి ఉండగా.. ఆయన చుట్టూ చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఒక కెమెరామెన్ ఫోటో తీయడానికి అతను సిద్ధమవుతున్నప్పుడు, ఒక వ్యక్తి అతని పక్కన నిలబడి తన ఫోన్‌లో సెల్ఫీని క్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఇది రాహుల్ గాంధీకి నచ్చలేదు.. వెంటనే ఆ వ్యక్తిని దూరంగా నెట్టడం వీడియోలో రికార్డు అయింది. ప్రజలంటే కాంగ్రెస్ కు కేవలం ఓటు బ్యాంకు అని విమర్శలు గుప్పిస్తూ బీజేపీ నేతలు ట్వీట్లు చేస్తున్నారు.
మరో వైపు భారత్ జోడో యాత్రలో కరోనా మార్గదర్శకాలను విధిగా పాటించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం కోరింది. లేదంటే యాత్రను వాయిదా వేసుకోవాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు సైతం కరోనా మార్గదర్శకాల అమలుకు సంబంధించి మాండవీయ లేఖ రాశారు.