భారత ఉపరాష్ట్రపతిగా నేడు రాధాకృష్ణన్ ప్రమాణం

భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణం చేయనున్నారు

By -  Knakam Karthik
Published on : 12 Sept 2025 7:29 AM IST

National News, Delhi, Vice President of India, Radhakrishnan

భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణం చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 752 ఓట్లకు గాను ఆయనకు 452 ఓట్లు లభించాయి. మహారాష్ట్ర రాజ్ భవన్లో రాధాకృష్ణన్‌కు బుధవారం సత్కార కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజీపడని జాతీయవాదినని స్పష్టం చేశారు. గవర్నర్‌గా కొనసాగిన 13 నెలల కాలాన్ని ప్రజాజీవితంలో సంతోషకరమైన సమయంగా అభివర్ణించారు. పరిపాలనాపరంగా, రాజకీయంగా మహారాష్ట్ర తనకు ఎంతో నేర్పిందని ఆయన అన్నారు.

భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతిగా నూతన బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నాడు రాధాకృష్ణన్ రాజీనామాతో ఖాళీ అయిన మహారాష్ట్ర గవర్నర్ పదవికి తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు మహారాష్ట్ర బాధ్యతలను అదనంగా అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story