వీడిన ఉత్కంఠ.. ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామి
Pushkar Singh Dhami as Uttarakhands new CM.ఉత్తరాఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి
By తోట వంశీ కుమార్ Published on 3 July 2021 11:03 AM GMTఉత్తరాఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎంగా పుష్కర్ సింగ్ ధామి పేరును ఖరారు చేసింది బీజేపీ. ఈమేరకు శనివారం జరిగిన సమావేశంలో భాజపా శాసనసభా పక్ష నేతగా పుష్కర్‌ను ఎన్నుకున్నారు. దీంతో తదుపరి సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. డెహ్రాడూన్ లో కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారల ఇంఛార్జ్ నరేంద్రసింగ్ తోమర్ సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. కాగా, ఉత్తరాఖండ్‌లో నాలుగు నెలల వ్యవధిలో పుష్కర్‌సింగ్ ధామి మూడో సీఎం.. ఆయన ఉదమ్‌సింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు.
అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి తీరథ్ సింగ్ రావత్ శుక్రవారం రాజీనామ చేసిన విషయం తెలిసిందే. తొలుత సీఎం రేసులో సత్పాల్ మహారాజ్, ధనసింగ్ రావత్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే.. గత అనుభవం దృష్ట్యా ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్యే వైపే అధిష్ఠానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఇక సీఎంగా తనను ఎన్నుకోవడంతో పుష్కర్ ఆనందం వ్యక్తం చేశారు,
45 ఏళ్ల పుష్కర్ సింగ్ ధామి.. 1975 సెప్టెంబరు 16న పితోడ్‌గడ్‌లోని కనాలిచిన్నా ప్రాంతంలో జన్మించారు. 2002లో లఖ్‌నవూ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఆతరువాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2002 నుంచి 2006 మధ్య భాజపా రాష్ట్ర జనతా యువ మోర్చాకు అధ్యక్షుడిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భగత్‌సింగ్ కోశ్యారీకి ఓఎస్డీగా పనిచేశారు. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడు.