దీపావళి పండుగకు ముందు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో బాణ సంచా క్రయ విక్రయం, ఉపయోగించడంపై నిషేదం విధించింది. ఎవరైనా సరే బాణ సంచా కొనుగోలు చేసినా, కాల్చినా ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు ఉత్వర్తులు జారీ చేసింది.
బుధవారం పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బాణసంచా తయారీ, నిలువ, విక్రయాలు జరపడం నేరం అని చెప్పారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంగిస్తే అందుకు రూ.5000 వరకు జరిమానా, పేలుడు పదార్థాల సెక్షన్ 9బీ ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేశారు. దీపాలు వెలిగించండి.. పటాకులు కాదు అనే అవగాహన కార్యక్రమాన్ని అక్టోబర్ 21న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఆ రోజు సెంట్రల్ పార్క్ వద్ద 51 వేల దీపాలు వెలిగించనున్నట్లు చెప్పారు. ఎవరైనా బాణ సంచా కొనుగోలు చేసినా.. కాల్చినా రూ.200 జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. నిషేదాన్ని అమలు చేసేందుకు 408 బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
గత రెండేళ్లుగా ఢిల్లీలో టపాసుల తయారీ, నిల్వ చేయడం, అమ్మకాలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ వరకు వీటిపై సంపూర్ణ నిషేధం విధిస్తూ సెప్టెంబర్‌లో తిరిగి ఉత్తర్వులను ప్రభుత్వం జారీచేసింది.