చరణ్ జిత్ సింగ్ చన్నీ ఇటీవలే పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే చరణ్‌జీత్ సింగ్ క్యాబినెట్ సహచరులుగా మొత్తం 15 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. వారిచేత పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణస్వీకారం చేయించారు. చరణ్‌జీత్‌సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ, ఆ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ, డీజీపీ ఇతర ఉన్నతాధికారులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. తాజాగా క్యాబినెట్‌లో ఆరుగురు ఎమ్మెల్యేలు మొదటిసారి మంత్రి పదవులు దక్కించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు ఈ కొత్త మంత్రివర్గం కొలువుదీరింది.
ఇక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఆయన భటిండా పర్యటనకు వెళ్లగా కలాన్ అనే గ్రామం నుంచి సీఎం కాన్వాయ్ వెళుతోంది. అదే సమయంలో రోడ్డు పక్కగా ఓ వివాహ వేడుక జరుగుతోంది. ఇది గమనించిన సీఎం చరణ్ జిత్ చన్నీ వెంటనే తన కాన్వాయ్ ఆపాలంటూ ఆదేశాలు ఇచ్చారు. కారు దిగిన ఆయన నేరుగా పెళ్లిమంటపం వద్దకు వెళ్లి వధూవరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. పిలవకపోయినా సీఎం రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సీఎం చరణ్ జిత్ చన్నీ ఆ వధూవరులకు ఆశీస్సులు అందజేశారు. పెళ్లిమంటపం వద్ద అందించిన మిఠాయి కూడా తిన్నారు.