Video: గుజరాత్‌లో కుప్పకూలిన శిక్షణా విమానం, పైలట్ మృతి
గుజరాత్ అమ్రేలిలోని శాస్త్రి నగర్‌లో ఒక శిక్షణ విమానం కూలిపోవడంతో అందులో ఉన్న పైలట్ మరణించాడు.
By Knakam Karthik
Video: గుజరాత్‌లో కుప్పకూలిన శిక్షణా విమానం, పైలట్ మృతి
గుజరాత్ అమ్రేలిలోని శాస్త్రి నగర్‌లో ఒక శిక్షణ విమానం కూలిపోవడంతో అందులో ఉన్న పైలట్ మరణించాడు. మృతుడిని అనికేత్ మహాజన్‌గా గుర్తించారు, ప్రమాదం జరిగిన సమయంలో అతను సోలో శిక్షణ విమానంలో ఉన్నాడు. ప్రమాదం తరువాత పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో ఈ సంఘటన పరిసరాల్లో భయాందోళనలు రేకెత్తించాయి. దీంతో సమీపంలోని ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీశారు. అగ్నిమాపక, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. కాగా కుప్పకూలిన విమానం ప్రైవేట్ విమానయాన శిక్షణ సంస్థకు చెందినదిగా గుర్తించారు.
ఈ సంఘటన గుజరాత్‌లోని ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలు అనుసరిస్తున్న భద్రతా ప్రోటోకాల్‌ల గురించి మరోసారి ఆందోళనలను రేకెత్తించింది. గత నెలలో గుజరాత్‌లో శిక్షణా విమానంలో జరిగిన రెండో సంఘటన ఇది. మార్చిలో, మెహ్సానా జిల్లాలోని ఒక గ్రామ శివార్లలోని పాఠశాల సమీపంలో మరొక శిక్షణా విమానం కూలిపోయింది. ఒక ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం కూలిపోవడంతో ఒక మహిళా శిక్షణా పైలట్ గాయపడ్డారు. ఈ సంఘటనకు సాంకేతిక సమస్యలే కారణమని మెహ్సానా తాలూకా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ డిజి బద్వా తెలిపారు. కాగా ఏప్రిల్ 3న, భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ సాధారణ శిక్షణా కార్యక్రమంలో జామ్‌నగర్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో హర్యానాలోని రేవారీకి చెందిన 28 ఏళ్ల ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా ఈ ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన పరిస్థితులను నిర్ధారించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కూడా విచారణ ప్రారంభించే అవకాశం ఉంది.