రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ సెటైర్లు
లోక్‌సభ ఎన్నికల వేళ దేశ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
By Srikanth Gundamalla Published on 14 April 2024 10:12 AM GMTరాహుల్ గాంధీపై ప్రధాని మోదీ సెటైర్లు
లోక్‌సభ ఎన్నికల వేళ దేశ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఎలాగైనా కేంద్రంలో అధికారంలోకి రావాలని ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రచారం నిర్వహిస్తోంది. ఇక ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ కూటమి అన్ని వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన కామెంట్స్‌పై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ అయ్యారు. రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు.
మధ్యప్రదేశ్‌లోని హోషాంగాబాద్‌లో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ఇన్నాళ్లు ఈ రాయల్ మాంత్రికుడు ఎక్కడ దాక్కున్నాడని రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఉన్న పేదరికాన్ని ఒకే దెబ్బతో లేకుండా చేస్తానని మాట్లాడుతున్నారనీ.. అది ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. ఇండియా కూమి మేనిఫెస్టోలోని ప్రతి హామీ దేశాన్ని దివాళా తీయిస్తుందని మండిపడ్డారు ప్రధాని. గత వారం రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకే దెబ్బతో పేదరికం లేకుండా చేస్తామని అన్నారు. మీరు గనుక దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే వారి ఖాతాల్లోకి లక్ష రూపాయలు వచ్చి పడతాయని అన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాల్లోని మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జమ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విషయం తెలిసిందే.