లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది: మోదీ
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370కి పైగా సీట్లను సాధించబోతుందని ప్రధాని మోదీ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 11 Feb 2024 3:57 PM ISTలోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది: మోదీ
లోక్‌సభ ఎన్నికల కోసం జాతీయ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందుకు ఎన్డీఏ కూటమని ముందుకెళ్తుంది. ఇక ఇండియా కూటమి ఎలాగైనా మోదీ ప్రభుత్వాన్ని కూలగొట్టి తాము అధికారంలోకి రావాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో రెండు కూటముల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి.
ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. ఝుబువా జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370కి పైగా సీట్లను సాధించబోతుందని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే ఒక్కో బూత్‌లో 370 ఓట్లు అదనంగా పోలయ్యేలా చూడాలని.. 370కి పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిచేలా చూడాలని కోరారు. ఈ మేరకు కార్యకర్తలు పనిచేయాలని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే.. మధ్యప్రదేశ్‌కు తాను లోక్‌సభ ఎన్నిక ప్రచారం కోసం రాలేదనీ.. ప్రజా సేవకుడిగా వచ్చానన్నారు. మధ్యప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అభివృద్ధి రెట్టింపు వేగంగా కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
విపక్షాలకు చెందిన పెద్ద పెద్ద నాయకులు కూడా మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని చెబుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఎన్డీయేకు మొత్తం 400 సీట్లు దాటుతాయని అంటున్నట్లు చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్.. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అన్నారు. ఎన్నికలు వస్తే తప్ప కాంగ్రెస్‌కు రైతులు, పేదలు, గ్రామాలు గుర్తుకు రావని అన్నారు. కాంగ్రెస్ నినాదం దోచుకోవడం, విభజించడమే అన్నారు. గుజరాత్‌లో గిరిజన ప్రాంతాల్లో స్కూళ్లు లేక విద్య కోసం కిలోమీటర్ల మేర నడిచారని చెప్పారు. తాను సీఎం అయ్యాక ఆయా ప్రాంతాల్లో స్కూళ్లనుపెట్టానని చెప్పారు మోదీ. కాంగ్రెస్ ఇన్నేళ్లలో కేవలం 100 ఏకలవ్య స్కూళ్లను పెఇడితే.. బీజేపీ గత 10 ఏళ్లలో భారీ సంఖ్యలో స్కూళ్లను ఏర్పాటు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.