ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరేసిన ప్రధాని మోదీ

Prime Minister Modi hoisted the national flag on the Red Fort. దేశ వ్యాప్తంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలంతా వేడుకల్లో పాల్గొంటున్నారు.

By అంజి  Published on  15 Aug 2022 8:10 AM IST
ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరేసిన ప్రధాని మోదీ

దేశ వ్యాప్తంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలంతా వేడుకల్లో పాల్గొంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగరవేశారు. జాతీయ గీతాలాపన అనంతరం ఆహుతులపై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలీకాప్టర్లు పూల వర్షం కురిపించాయి. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, స్మృతి ఇరాని, నిర్మలా సితారామన్‌ సహా ఇతర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, అతిథులు పాల్గొన్నారు.

అంతకుముందు ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ త్రివర్ణ పతాకం దేశంలోని నలుమూలల్లో సగర్వంగా రెపరెపలాడుతోందని అన్నారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తాను భారతీయులందరికీ, భారత్‌ను ప్రేమించే వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

నవ సంకల్పంతో నూతన దిశలో పయనించే రోజు ఇదని ప్రధాని మోదీ అభివర్ణించారు. మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు, తాత్యా తోపే, భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ వంటి ఎంతో మంది విప్లవకారులకు ఈ దేశం కృతజ్ఞతలు తెలుపుకుంటోందని మోదీ వ్యాఖ్యానించారు. రాణి లక్ష్మీబాయి, ఝల్కారీ బాయి, చెన్నమ్మ, బెగన్ హజ్రత్ మహల్.. భారత మహిళల బలాన్ని గుర్తు చేసుకుంటే భారతదేశంలోని ప్రతిఒక్కరూ గర్వంతో నిండిపోతారని అన్నారు. గత 75 ఏళ్లలో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించిన దేశ పౌరులందరినీ ఈ రోజు స్మరించుకోవాల్సిన రోజు ఇది అని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లిలాంటిదన్న ప్రధాని మోదీ.. 75 ఏళ్ల ప్రయాణంలో భారత్‌కు అమూల్యమైన సామర్థ్యం, అనేక సవాళ్లు ఎదుర్కొని నిరూపించుకుందన్నారు.




Next Story