ఒకే రోజు 5 వందే భారత్ రైళ్లు ప్రారంభం
వందే భారత్ రైళ్ల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఐదు వందే భారత్ రైళ్లు ఒకే రోజు పట్టాలెక్కాయి.
By అంజి Published on 27 Jun 2023 1:13 PM IST
ఒకే రోజు 5 వందే భారత్ రైళ్లు ప్రారంభం
వందే భారత్ రైళ్ల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఐదు సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లు ఒకే రోజు పట్టాలెక్కాయి. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా అక్కడ ఐదు వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. పక్క రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలకు కనెక్ట్ అయ్యేలా ఈ రైళ్ల సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. మంగళవారం ఉదయం భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని.. ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు.
భోపాల్(రాణికమలాపతి)-జబల్‌పుర్, ఖజురహో-భోపాల్-ఇందౌర్, హతియా-పట్నా, ధార్వాడ్-బెంగళూరు, గోవా(మడ్గావ్)-ముంబయి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తూ మోదీ జెండా ఊపారు. ఇందులో రెండు రైళ్లను భౌతికంగా ప్రారంభించగా, మిగతా మూడు రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వందే భారత్ రైల్లో చిన్నారులతో మోదీ ముచ్చటించారు. ఒకేరోజు ఇన్ని వందేభారత్ రైళ్లను ప్రారంభించడం ఇదే తొలిసారి. ఈ రైళ్లు మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, బీహార్, జార్ఖండ్‌లలో కనెక్టివిటీని మెరుగుపర్చనున్నాయి.
వీటిలో రెండు రైళ్లు మధ్యప్రదేశ్‌లో పరుగులు పెట్టనున్నాయి. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్, రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఎన్నికల స్టంట్ అని ప్రతిపక్షాలు అంటున్నాయి.
प्रधानमंत्री श्री @narendramodi जी ने वंदे भारत एक्सप्रेस ट्रेनों के शुभारंभ के अवसर पर विद्यार्थियों से बातचीत की। #VandeBharatExpress pic.twitter.com/jHVmpPQYfQ
— BJP MadhyaPradesh (@BJP4MP) June 27, 2023