ఛత్రపతి శివాజీకి తలవంచి క్షమాపణలు చెప్పిన ప్రధాని మోదీ
మహారాష్‌ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఏర్పాటు చేసిన అతిపెద్ద శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు.
By అంజి Published on 30 Aug 2024 3:59 PM ISTఛత్రపతి శివాజీకి తలవంచి క్షమాపణలు చెప్పిన ప్రధాని మోదీ
మహారాష్‌ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఏర్పాటు చేసిన అతిపెద్ద శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. పాల్ఘర్‌లో వాడవణ్ పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఛత్రపతి శివాజీ అంటే పేరు మాత్రమే కాదని, ఆయన మనందరి దేవుడని అన్నారు. తల వంచి ఆయనను క్షమాపణలు కోరుతున్నానని ఏర్కొన్నారు.
మాల్వాన్‌లోని సింధుదుర్గ్ కోటలో గతేడాది ఏర్పాటు చేసిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం నేలకూలింది. విగ్రహం ప్రారంభించిన 9 నెలలకే కూలిపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆగస్టు 26న మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం క్షమాపణలు చెప్పారు.
మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే మనకు పేరు మాత్రమే కాదు. ఆయన అందరికీ దేవుడు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి తల వంచి క్షమాపణలు చెబుతున్నాను" అని అన్నారు.
"ఛత్రపతి శివాజీ మహారాజ్‌ని తమ ఆరాధ్యదైవంగా భావించి, తీవ్రంగా బాధపడ్డ వారికి నేను శిరస్సు వంచి క్షమాపణలు చెబుతున్నాను. . మనకు మన దైవం కంటే పెద్దది ఏమీ లేదు" అన్నారాయన.
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని కోటలో గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 35 అడుగుల విగ్రహం ఆగస్టు 26న కూలిపోయింది. బలమైన గాలుల కారణంగా విగ్రహం కూలిపోయిందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు.
సింధుదుర్గ్‌లోని రాజ్‌కోట్ కోటలో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. గత వారం భారీ వర్షాలు మరియు, ఈదురు గాలులు వీచాయి.
స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్, అతని సిద్ధాంతాలపై తరచుగా దాడి చేస్తున్నందుకు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా ప్రధాని తీవ్రంగా విమర్శించారు. "భారతమాత యొక్క గొప్ప కుమారుడు, ఈ నేల కుమారుడు, వీర్ సావర్కర్‌ను దూషించే, అవమానించే వ్యక్తులు మేము కాదు. వారు (ప్రతిపక్షాలు) క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేరు, వారు కోర్టులకు వెళ్లి పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు" అని అన్నారు.