హైదరాబాద్‌లో ‘లోక్ మంథన్’ను ప్రారంభించనున్న రాష్ట్రపతి ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 22న హైదరాబాద్‌లో లోక్‌మంథన్-2024ను ప్రారంభించనున్నారు.

By Kalasani Durgapraveen  Published on  14 Nov 2024 11:23 AM IST
హైదరాబాద్‌లో ‘లోక్ మంథన్’ను ప్రారంభించనున్న రాష్ట్రపతి ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 22న హైదరాబాద్‌లో లోక్‌మంథన్-2024ను ప్రారంభించనున్నారు. 'నేషన్-ఫస్ట్' మేధావులు, పరిశోధకులు, విద్యావేత్తల సంస్థ అయిన‌ ప్రజ్ఞా ప్రవహ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో వివిధ అంశాలపై చర్చలు ఉంటాయి. లోక్ మంథన్ ప్రారంభానికి ముందు ఎగ్జిబిష‌న్‌, సాంస్కృతిక కార్యక్రమాలు నవంబర్ 21 న మొద‌లుకానున్నాయి.

నవంబర్ 21 నుండి 24 వరకు జరిగే ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఇతర ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. లోక్‌మంథన్, ద్వైవార్షిక కార్యక్రమం, గతంలో భోపాల్, రాంచీ, గౌహతిలో జ‌ర‌గ‌గా.. ఇది 2016లో ప్రారంభమైంది.

భారతీయతకు ప్రాధాన్యతనిచ్చి, ఆ దిశగా ఆలోచన – ఆచరణ చేసేవారిని ఒకే వేదికపైకి తీసుకుని వచ్చి, తద్వారా సామాజిక ప్రధాన జీవన స్రవంతి కథనంలో మరుగున పడిన వర్గాలు, సమాజాలకు ఒక స్థానం, ఒక స్వరం ఇవ్వడమన్నది లోక్‌మంథన్ లక్ష్యం. తమ పూర్వీకుల నుంచి సంప్రదాయంగా వచ్చిన విజ్ఞానాన్ని, వివేకాన్ని వీరు తిరిగి దక్కించుకోవాలి. వారి ఆలోచనా ధార, విశ్వాసాలు, జీవన విధానం, వారి దృక్పథం, అనేక సహస్రాబ్దాలుగా వారి సమాజాన్ని నడిపిన సంస్థలు, వ్యవస్థలకు సంబంధించిన అంశాలను వెలికి తీసుకురావాలని లోక్‌మంథన్ భావిస్తోంది. ఆ కోణంలో, మేధావులు, కళాకారులు, ప్రతి రంగానికి చెందినవారిని ఒకే వేదికపైకి తీసుకురావాలన్నది లోక్‌మంథన్ ప్రయత్నం.

Next Story