దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా ఇవాళ సాయంత్రం 7 గంటలకు జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ముర్ము మాట్లాడుతూ.. ముందుగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇది దేశ ప్రజలందరూ సంబరాలు చేసుకోవాల్సిన సమయం అన్నారు. అమరుల త్యాగాలను మనమంతా గుర్తు చేసుకోవాలన్నారు. జవాన్ల ప్రాణత్యాగల వల్లే మనం ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చగలుగుతున్నామని రాష్ట్రపతి ముర్ము అన్నారు.
మనది శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశమే కాదని, విజయవంతమైన ప్రజాస్వామ్య దేశమని పేర్కొన్నారు. భారత్ అనేక రంగాల్లో ముందుకెళ్తోందని, కరోనా కష్టకాలాన్ని అధిగమించామన్నారు. కోవిడ్ తర్వాత మన ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని, వ్యాక్సినేషన్‌లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామని ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో పేర్కొన్నారు. స్టార్టప్‌ల ఏర్పాటుతో దేశ అభివృద్ధిలో దూసుకెళ్తున్నామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ విధానం ఎంతగానో మార్పులు తీసుకొచ్చిందని చెప్పారు.
ఆత్మ నిర్బర్ భారత్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ముర్ము పిలుపునిచ్చారు. లింగ వివక్ష తగ్గుముఖం పట్టిందన్న రాష్ట్రపతి.. సమాజంలో అసమానతలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యావత్ దేశం ఇప్పుడు 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారని చెప్పారు. దేశంలో రోజురోజుకు ప్రజాస్వామ్యం బలోపేతం అవుతున్నదని అన్నారు.