లైంగిక వేధింపుల ఆరోపణలతో దేశం విడిచిపెట్టిన కర్ణాటక ఎంపీ, జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణ మే 31న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరవుతానని చెప్పారు. "నన్ను తప్పుపట్టవద్దు, 31వ తేదీ ఉదయం 10 గంటలకు సిట్ ఎదుట హాజరవుతాను, సహకరిస్తాను, న్యాయవ్యవస్థను నమ్ముతాను, నాపై తప్పుడు కేసులు పెట్టారు." అంటూ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోను విడుదల చేశారు.
33 ఏళ్ల హసన్ ఎంపీ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలువురు మహిళలను లైంగికంగా వేధించిన వీడియోలు బయటకు రావడంతో ఏప్రిల్ 27న అతను దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రజ్వల్ రేవణ్ణ ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు కూడా చెప్పారు. “విదేశాల్లో నేను ఎక్కడ ఉన్నానో సరైన సమాచారం అందించనందుకు నా కుటుంబ సభ్యులకు, మా కుమారన్న [ హెచ్‌డి కుమారస్వామి], పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఏప్రిల్ 26, ఎన్నికలు ముగిసినప్పుడు, నాపై ఎటువంటి కేసు లేదు. నేను వెళ్లిన రెండు, మూడు రోజుల తర్వాత కూడా సిట్ ఏర్పాటు కాలేదు" అంటూ చెప్పుకొచ్చారు.