జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు, ఎన్డీయే హసన్ లోక్‌సభ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) దర్యాప్తు చేస్తోంది. పార్టీ కార్యకర్త ఫిర్యాదు మేరకు అతనిపై అత్యాచారం కేసు నమోదు చేసింది. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌పై హాసన్‌కు చెందిన జేడీ(ఎస్) మహిళా కార్యకర్త ఫిర్యాదు చేయడంతో ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసింది. ప్రజ్వల్ తనపై తుపాకీ గురి పెట్టి అత్యాచారం చేసి.. మొబైల్‌లో వీడియోలు తీశాడని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
ప్రజ్వల్ తనను ఎంపీ క్వార్టర్స్‌కు తీసుకెళ్లి అక్కడ తుపాకీతో బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. తాను చేసిన పనిని ఎవరికైనా చెబితే తనతో పాటు తన భర్తను కూడా చంపేస్తానని బెదిరించాడని ఆమె వాపోయింది. నిందితుడు తాను కోరినప్పుడల్లా కోరిక తీర్చమని బలవంతం చేశాడని, సహకరించకపోతే వీడియోను పబ్లిక్‌గా పెడతానని బెదిరించాడని చెప్పుకొచ్చింది. ప్రజ్వల్ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేసు దర్యాప్తు చేస్తోంది. 33 ఏళ్ల ఎంపీ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అనేక వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.