రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం సమయంలో ప‌వ‌ర్ క‌ట్‌.. 9 నిమిషాలు చీకటిలోనే..

Power Outage During President Murmu’s Address At MSBD University. ఒడిశాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం సందర్భంగా విద్యుత్ వైఫల్యం వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat  Published on  6 May 2023 11:08 AM GMT
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం సమయంలో ప‌వ‌ర్ క‌ట్‌.. 9 నిమిషాలు చీకటిలోనే..

ఒడిశాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం సందర్భంగా విద్యుత్ వైఫల్యం వెలుగులోకి వచ్చింది. మహారాజా శ్రీ రామచంద్ర భంజ్‌దేవ్ యూనివర్శిటీ 12వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో కరెంటు పోయింది. అనంతరం చీకట్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని కొనసాగించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్న సమయంలో 9 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడాన్ని అందరూ ఖండిస్తున్నారు. రాష్ట్రపతి కార్యక్రమం సందర్భంగా శనివారం ఉదయం 11.56 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. కరెంటు లేకపోవడంతో సభా ప్రాంగణమంతా అంధకారం నెలకొంది. అయితే ఆ చీకట్లోనే రాష్ట్రపతి ప్రసంగాన్ని కొనసాగించారు.

ద్రౌపది ముర్ము విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఈరోజు ఈ కార్యక్రమం చూసి కరెంటు కూడా మనల్ని చూసి ఈర్ష్య పడటం మొదలైందని నవ్వుతూ అన్నారు. చీకట్లో కూర్చున్నాం కానీ చీకటి, వెలుగు రెండింటినీ సమానంగా తీసుకుంటామ‌న్నారు.

రాష్ట్రపతి కార్యక్రమం సందర్భంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్‌ శాఖ తన తప్పిదానికి పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. సమాచార పౌరసంబంధాల శాఖ కూడా తప్పును అంగీకరించింది. రాష్ట్రపతి కార్యక్రమంలో గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ గణేశి లాల్, మంత్రి ప్రదీప్ కుమార్ అమత్, వైస్ ఛాన్సలర్ సంతోష్ త్రిపాఠి కూడా ఉన్నారు. ఘటన తర్వాత మయూర్‌భంజ్ జిల్లా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ కోసం ముగ్గురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు.


Next Story