ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాం.. కాంగ్రెస్‌కు ఈసీ ఆహ్వానం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం శనివారం స్పందిస్తూ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని పేర్కొంది.

By Medi Samrat  Published on  30 Nov 2024 3:30 PM GMT
ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాం.. కాంగ్రెస్‌కు ఈసీ ఆహ్వానం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం శనివారం స్పందిస్తూ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని పేర్కొంది. ఆ తర్వాత కూడా పార్టీ లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు లిఖితపూర్వకంగా, మౌఖిక మార్గాల్లో సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కమిషన్ తెలిపింది. ఈ మేర‌కు డిసెంబరు 3న సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ పార్టీ ప్ర‌తినిధి బృందంతో సమావేశం అవ‌నున్న‌ట్లు ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. ఎన్నికల్లో అవకతవకలకు సంబంధించి నవంబర్ 29న కాంగ్రెస్ పార్టీ సమర్పించిన మెమోరాండంపై ఎన్నికల సంఘం ఈ సమాధానం ఇచ్చింది. ఇందులో ఓట్ల సంఖ్య, ఓటింగ్ శాతంపై ప్రశ్నలు సంధించారు.

శుక్రవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోప‌ణ‌లు చేసింది. అయితే దీని తర్వాత కూడా మరికొన్ని ఫిర్యాదులు, సమాచారం ఉంటే వాటిని వివరంగా వినేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు కమిషన్ తెలిపింది. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతంగా ఎన్నికల కోసం రాజకీయ పార్టీల నుండి వచ్చే సూచనలు, ఫిర్యాదులను ఎల్లప్పుడూ స్వాగతిస్తున్నట్లు కమిషన్ తెలిపింది.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మ‌హాయుతి కూట‌మి ఎన్నికలలో తీవ్రమైన అక్రమాలకు పాల్పడంద‌ని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఫిర్యాదు కూడా వచ్చింది. కాంగ్రెస్ చేసిన రెండు ప్రధాన ఆరోపణలపై ఎన్నికల సంఘం శనివారం సవివరంగా స్పందించింది. ఇందులో మొదటి ఆరోపణ ఓటింగ్ శాతానికి సంబంధించింది. ఇందులో ఓటింగ్ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటల మధ్య లెక్కల్లో భారీ వ్యత్యాసం ఉందని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీనిపై ఎల‌క్ష‌న్‌ కమీషన్ ఓటింగ్ శాతానికి సంబంధించి నిర్ణీత ప్రక్రియ ఉందని.. ఓటింగ్ సమయంలో కూడా అదే విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేసింది.

ఓటరు జాబితాకు సంబంధించి కాంగ్రెస్ తన మెమోరాండమ్‌లో రెండవ ముఖ్యమైన ఫిర్యాదు చేసింది. మహారాష్ట్ర ఎన్నికలలో సాయంత్రం 5 గంటల తర్వాత ఓటింగ్ శాతం భారీగా పెరగడం, ఈవీఎంలకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులను శుక్రవారం కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి సమర్పించింది.

Next Story