కోర్టులో పేలిన గ్రెనేడ్.. పోలీసుకు గాయాలు
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని కోర్టులోని సాక్ష్యాధారాల గదిలో జరిగిన పేలుడులో ఓ పోలీసు గాయపడ్డాడు
By Medi Samrat Published on 24 Oct 2024 4:02 PM ISTజమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని కోర్టులోని సాక్ష్యాధారాల గదిలో జరిగిన పేలుడులో ఓ పోలీసు గాయపడ్డాడు. గురువారం బారాముల్లా నగరంలోని కోర్టులోని 'మల్ఖానా (సాక్ష్యం గది)' లోపల గ్రెనేడ్ (ఒక కేసులో సాక్ష్యంగా సేకరించబడింది) పేలినట్లు అధికారులు తెలిపారు. పేలుడు సంభవించడంతో కోర్టు ఆవరణలో గందరగోళం నెలకొంది. ఈ పేలుడులో ఒక పోలీసు గాయపడ్డాడని.. అతడిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు మధ్యాహ్నం 1:05 గంటల ప్రాంతంలో బారాముల్లా కోర్టులోని మల్ఖానాలో ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుకు గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స కొనసాగుతోంది. వదంతులను పట్టించుకోవద్దని పోలీసులు ప్రజలను కోరారు.
ఇదిలావుంటే.. ఈ తెల్లవారుజామున జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ట్రాల్ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చి గాయపరిచారు. బటాగుండ్ గ్రామంలో బిజ్నోర్ నివాసి శుభమ్ కుమార్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. అతని చేతికి బుల్లెట్ గాయమైనట్లు అధికారులు తెలిపారు. శుభమ్ కుమార్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. గత వారం రోజుల్లో కశ్మీర్‌లో స్థానికేతర కార్మికులపై దాడి జరగడం ఇది మూడోసారి. ఆదివారం, గందర్‌బల్ జిల్లాలోని నిర్మాణ స్థలంపై ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు స్థానికేతర కార్మికులు, స్థానిక వైద్యుడు మరణించగా, అక్టోబర్ 18 న షోపియాన్ జిల్లాలో బీహార్‌కు చెందిన ఒక కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చి చంపారు.