నేను కేబినెట్ మంత్రిని.. నాపైనే దాడి చేస్తే ఎలా.?
బెంగాల్ కేబినెట్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ అండ్ లైబ్రరీ శాఖ మంత్రి సిద్ధిఖుల్లా చౌదరి కారుపై గురువారం దాడి జరిగింది.
By Medi Samrat
బెంగాల్ కేబినెట్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ అండ్ లైబ్రరీ శాఖ మంత్రి సిద్ధిఖుల్లా చౌదరి కారుపై గురువారం దాడి జరిగింది. ఆయన తన అసెంబ్లీ నియోజకవర్గమైన తూర్పు వర్ధమాన్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటన తర్వాత ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి తన సొంత పార్టీ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులే చేశారని ఆరోపించారు.
ఈ దాడికి పాల్పడిన తృణమూల్‌కు చెందిన రఫీకుల్ ఇస్లాం షేక్ (పంచాయతీ కమిటీ అధ్యక్షుడు)ని పార్టీ బహిష్కరించాలని లేకుంటే నేను పార్టీని వీడిపోతానని సిద్ధిఖుల్లా చౌదరి అన్నారు. నేను కేబినెట్ మంత్రిని, నాపైనే దాడి చేస్తే ఎలా.? ఈ విషయాలన్నీ పోలీసుల ఎదుటే జరిగినా వారు ఏమీ చేయలేదు. ఈ విషయాలన్నీ పోలీసులు చూశారు. సీఎం కార్యాలయానికి సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, మేయర్ ఫిర్హాద్ హకీం నాకు ఫోన్ చేసి న్యాయం చేస్తామని చెప్పారు. అహ్మద్ హుస్సేన్‌ని తరిమికొట్టకపోతే నేను పార్టీని వీడిపోతాను. సంఘటన స్థలం నుండి లభించిన ఛాయాచిత్రాలలో, చౌదరి కారు విండ్‌షీల్డ్ దెబ్బతిన్నట్లు, వాహనం లోపల గాజు ముక్కలు చెల్లాచెదురుగా కనిపిస్తాయి.
చౌదరి 2021లో తృణమూల్ టికెట్‌పై పుర్బా బర్ధమాన్ జిల్లాలోని మోంటేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. స్థానిక పంచాయితీ ప్రధాన్, అతని వర్గానికి చెందిన గుంపు తన వాహనంపై రాళ్లు విసిరి, అద్దాలు పగలగొట్టిందని, నా చేతికి గాయం అయ్యిందని విలేకరులతో అన్నారు. స్థానిక పంచాయతీ హెడ్ రఫీకుల్ ఇస్లాం షేక్ తన మద్దతుదారులతో కలిసి నాపై దారుణంగా దాడికి పాల్పడ్డాడని ఆయన అన్నారు. దాడి చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.
మోంటేశ్వర్ ప్రజలకు ఏమీ చేయని అవినీతి మంత్రిపై విసిగిపోయిన స్థానిక ప్రజలు నల్ల జెండాల నిరసన తెలిపారని.. తాను నిరసనకు నాయకత్వం వహించానని షేక్ అంగీకరించాడు. మంత్రిని మా ఫిర్యాదులను వినాలని మేము కోరాము.. అయితే ఆయన కాన్వాయ్ వేగంగా వెళ్లడానికి ప్రయత్నించిందని, దాని వల్ల తన వాహనానికి కొంత నష్టం జరిగిందని.. దీనినే హత్యాయత్నం అంటూ డ్రామా సృష్టిస్తున్నారని అన్నాడు.