శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం వారణాసి చేరుకున్నారు. ఆయన రాగానే గురువారం అర్థరాత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి శివపూర్-ఫుల్వారియా-లహర్తర మార్గ్‌ను పరిశీలించారు. 360 కోట్లతో నిర్మించిన ఈ రహదారి BHU నుండి విమానాశ్రయం వైపు ప్రయాణ సమయాన్ని 75 నిమిషాల నుండి 45 నిమిషాలకు తగ్గిస్తుంది. లహర్తర నుండి కచాహ్రీకి దూరాన్ని 30 నిమిషాల నుండి 15 నిమిషాలకు తగ్గిస్తోంది.
వారణాసిలో శుక్రవారం సంత్ రవిదాస్ జయంతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి కేవలం వారి కుటుంబాల కోసం పనిచేస్తుందని పేదల సంక్షేమం పట్టించుకోరని ఆరోపించారు. సంత్ రవిదాస్ జీ ఆలోచనలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుందని, ఈ ప్రభుత్వ పధకాలు అందరికీ వర్తిస్తాయని చెప్పారు. సమాజంలోని ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమాజంలో అణగారిన వర్గాలకు ప్రాధాన్యత దక్కినప్పుడే సమానత్వం సాకారమవుతుందని అన్నారు.