ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద 2025-26 సంవత్సరానికి రూ. 12,000 కోట్ల సబ్సిడీని కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదించింది. దీనివల్ల 10.33 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. రక్షాబంధన్‌కు ముందు తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని మహిళలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుస్తుంది. దీనితో పాటు చమురు మార్కెటింగ్ కంపెనీలకు (OMCs) 30,000 కోట్ల రూపాయల LPG సబ్సిడీని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. శుక్రవారం మంత్రివర్గంలో తీసుకున్న ఈ నిర్ణయాలను సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా పేద కుటుంబాల నుండి వయోజన మహిళలకు ఉచిత LPG కనెక్షన్లను అందించడానికి PMUY పథకం మే 2016లో ప్రారంభించబడింది. జూలై 1 నాటికి, భారతదేశంలో సుమారు 10.33 కోట్ల PMUY కనెక్షన్‌లు ఉన్నాయి.
"ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు సంవత్సరానికి 9 రీఫిల్‌లకు 14.2 కిలోల సిలిండర్‌కు రూ. 300 సబ్సిడీని ( 5 కిలోల సిలిండర్లకు దామాషా ప్రకారం) రూ. 12,000 కోట్ల వ్యయంతో అందించడానికి ఆమోదం తెలిపింది" అని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. భారతదేశం తన LPG అవసరాలలో దాదాపు 60 శాతం దిగుమతి చేసుకుంటుంది.
మంత్రివర్గ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లక్ష్యం. ఇప్పటివరకు 10.33 కోట్ల ఉజ్వల కనెక్షన్లు ఇవ్వబడ్డాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రధాన మంత్రి ఉజ్వల లబ్ధిదారులకు రూ.12,060 కోట్ల సహాయాన్ని కేబినెట్ ఆమోదించిందని తెలిపారు.