కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరం.. ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యవసర సమావేశం
PM to chair meet on COVID situation as new strain Omicron.దాదాపు గత రెండేళ్లుగా ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా
By తోట వంశీ కుమార్ Published on 27 Nov 2021 6:49 AM GMTదాదాపు గత రెండేళ్లుగా ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది కరోనా వైరస్. ఇప్పటికే పలు దేశాల్లో మూడో వేవ్ కూడా మొదలైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా తగ్గిపోయిందనుకున్న ప్రతిసారి కొత్త వేరియంట్ రూపంలో వస్తూ ఎంతో మంది ప్రాణాలను బలిగొంటుంది. ఇక తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఏకంగా 32 మ్యూటేషన్లు కలిగిన ఉన్న ఈ మహమ్మారి రెండు డోసుల టీకాలను తీసుకున్న వారిని కూడా వదలడం లేదు. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభం అయ్యింది.
ఈ భేటిలో కేబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో పాటు వ్యాక్సినేషన్ పై చర్చించనున్నారు. దేశంలోకి కొత్త వేరియంట్ రాకుండా ఎలా అడ్డుకోవాలనే దానిపైనే ప్రముఖంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికాలో గుర్తించిన సరికొత్త వేరియంట్ B.1.1.529కు ప్రపంచ ఆరోగ్య సంస్థ 'ఒమిక్రాన్'అని పేరు పెట్టింది. దీని స్పైక్ ప్రొటీన్ లో 32 మ్యుటేషన్లు ఉన్నట్టుగా గుర్తించారు. డెల్లా వేరియంట్ కంటే ఎన్నో రెట్లు ప్రమాదకారి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేగంగా వ్యాపించి, తీవ్ర లక్షణాలకు దారి తీయొచ్చునని ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఇది రెండు డోసుల టీకా తీసుకున్న వారిని కూడా వదలకపోవడం గమనార్హం. ఇప్పటికే ఇది దక్షిణాఫ్రికాను దాటి పొరుగుదేశాలకు వ్యాప్తిచెంది. దీనిపై అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు ఆఫ్రికా దేశాల నుంచి విమానాల రాకపోకలను నిషేదాలు విధించాయి. ఈ క్రమంలో ప్రధాని అధికారులతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.