వారిని రావద్దని చెప్పిన మోదీ.. రచ్చ మొదలైంది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటనకు వెళ్లగా.. తనను ఆహ్వానించడానికి

By M.S.R  Published on  26 Aug 2023 3:43 PM IST
వారిని రావద్దని చెప్పిన మోదీ.. రచ్చ మొదలైంది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటనకు వెళ్లగా.. తనను ఆహ్వానించడానికి సీఎం రావొద్దని విజ్ఞప్తి చేశారు. బ్రిక్స్ సమావేశాల కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధాని మోదీ శనివారం ఉదయం 6 గంటలకు నేరుగా బెంగళూరుకు వచ్చారు. చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అయిన తరుణంలో ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ కలవడానికి బెంగళూరు చేరుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ప్రధాని నరేంద్ర మోదీని బెంగళూరు విమానాశ్రయం వద్ద స్వాగతించలేదు.

ప్రధాని మోదీ వారిని ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచి, ప్రొటోకాల్ ను ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం మొదలు పెట్టింది. ‘తనకంటే ముందే కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలు ఇస్రో శాస్త్రవేత్తలను సత్కరించడం ఇష్టం లేకే ప్రధాని వారిని ఎయిర్‌పోర్టులో స్వాగతం పలకకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రొటోకాల్‌కు వ్యతిరేకం. ఇది చిల్లర రాజకీయం తప్ప మరేమీ కాదు’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. చంద్రయాన్ 1 సక్సెస్ అయినప్పుడు అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గుజరాత్ పర్యటించినప్పుడు సీఎంగా ఉన్న మోదీ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సందర్శించిన సంగతి మరిచిపోయారా? అని జైరాం రమేశ్ అన్నారు.

తాను బెంగళూరుకు ఏ సమయానికి చేరుకుంటానో తనకే తెలియదని, అందుకే సీఎం, డిప్యూటీ సీఎం, గవర్నర్‌లను ఇబ్బంది పెట్టవద్దనే స్వాగతించడానికి రావొద్దని విజ్ఞప్తి చేశానని ప్రధాని మోదీ వివరణ ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర విదేశీ పర్యటన ముగించుకుని బెంగళూరు నగరం పీణ్యాలోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ క‌మాండ్ నెట్వ‌ర్క్ మిష‌న్ కంట్రోల్ కాంప్లెక్స్‌ కు చేరుకున్నారు. బెంగుళూరు ఎయిర్‌పోర్టులో మోదీకి కర్ణాటక సీఎస్‌, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. HAL నుంచి రోడ్డు మార్గంలో ఇస్రో సెంటర్ కు మోదీ చేరుకున్నారు.

Next Story