బ్రెజిల్ కు ప్రధాని మోదీ.. అక్కడి నుండి ఎక్కడికంటే..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 16 నుండి 21 వరకు నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాలలో పర్యటించనున్నారు

By Medi Samrat  Published on  13 Nov 2024 12:00 PM GMT
బ్రెజిల్ కు ప్రధాని మోదీ.. అక్కడి నుండి ఎక్కడికంటే..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 16 నుండి 21 వరకు నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాలలో పర్యటించనున్నారు. 1968 తర్వాత గయానాలో పర్యటన చేసిన మొట్టమొదటి భారత ప్రధానిగా ప్రధాని మోదీ చరిత్ర సృష్టించనున్నారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ నవంబర్ 16-17 మధ్య నైజీరియాలో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉన్నత స్థాయి చర్చల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, రక్షణ రంగాలలో సహకారాన్ని చర్చించడంతో పాటు, నైజీరియాలోని భారతీయ సమాజంతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. నైజీరియాలోని భారతీయుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని మంత్రిత్వ శాఖ కూడా ధృవీకరించింది. నైజీరియా పర్యటనను ముగించుకొని ప్రధాని బ్రెజిల్‌ పర్యటనకు వెళ్లనున్నారు.

నవంబర్ 18, 19 తేదీల్లో బ్రెజిల్‌లోని రియోడిజనీరో నగరంలో జరగనున్న జీ-20 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. గతేడాది జీ-20 సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించగా..ఈ ఏడాది ఆ సదస్సుకు బ్రెజిల్‌ వేదికైంది. ఈ సమ్మిట్‌లో పలువురు ప్రపంచ నేతలతో ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. బ్రెజిల్‌ పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ గయానాకు వెళ్లనున్నారు. 56 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో గయానా అధ్యక్షుడు మొహమ్మద్‌ అలీతో మోదీ చర్చలు జరపనున్నారు.

Next Story