దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన మోదీ
PM Narendra Modi launches Corona Vaccination drive.కరోనా మహమ్మారి అంతం చేసేందుకు దేశవ్యాప్తంగా నేడు వ్యాక్సినేషన్
By తోట వంశీ కుమార్ Published on 16 Jan 2021 6:10 AM GMTకరోనా మహమ్మారి అంతం చేసేందుకు దేశవ్యాప్తంగా నేడు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం 10.30 నిమిషాలకు వర్చువల్ ద్వారా బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. దేశమంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూసిందని.. ఆ రోజు రానేవచ్చేసిందన్నారు. టీకా కోసం రాత్రి, పగలు తేడా లేకుండా కృషి చేసింన ప్రతి ఒక్కరికీ ప్రధాని అభినందనలు తెలియజేశారు.
సాధారణంగా టీకాల తయారీకి ఏళ్లు పడుతుందని.. కానీ మన శాస్త్రవేత్తలు అతి తక్కువ సమయంలోనే అభివృద్ది చేశారన్నారు. వారి కృషి ఫలితంగా నేడు ఒకటి రెండు స్వదేశీ టీకాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. దేశీయ టీకా తయారీలో భారత్ సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. నర్సులు, డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు తొలి హక్కు దారులని అన్నారు. వీరందరికీ ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులను ఖచ్చితంగా తీసుకోవాలని ప్రధాని సూచించారు. టీకా వేసుకున్నా.. మాస్క్, సామాజిక దూరం పాటించాల్సిదేనని స్పష్టం చేశారు.
టీకా ఎవరికీ ఏ సమయంలో ఇస్తామనేది ముందుగానే తెలియజేస్తామన్నారు. తొలి డోసు, రెండో డోసుకు మధ్య నెల రోజుల సమయం పడుతుంది. రెండో డోసు వేసుకున్న తర్వాతనే.. కరోనాకు వ్యతిరేకంగా మీ శరీరంలో వ్యాధి నిరోదక శక్తి పెరుగుతుందని వెల్లడించారు. ప్రసంగంలో భాగంగా మోదీ తెలుగులో మాట్లాడారు. దేశం అంటే మట్టి కాదు.. దేశం అంటే మనుషులోయ్ అన్న గురుజాడ వ్యాఖ్యలను మోదీ తన ప్రసంగంలో వినిపించారు. టీకాలను అతి చౌకగా అందిస్తున్నామన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ ధరకే టీకాలు అందుబాటులో ఉన్నట్లు మోదీ తెలిపారు. మన టీకాలను అతిశీతల వాతావరణంలో స్టోర్ చేయాల్సి అవసరం లేదని అన్నారు. దేశ వ్యాప్తంగా 3006 కేంద్రాల్లో 100 మందికి చొప్పున నేటి నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. తొలి రోజు 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా ఇవ్వనున్నారు.