ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి మాతృవియోగం

PM Modi's mother Heeraben dies at the age of 100.న‌రేంద్ర మోదీ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Dec 2022 8:09 AM IST
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి మాతృవియోగం

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. మోదీ మాతృమూర్తి హీరాబెన్ క‌న్నుమూసింది. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావ‌డంతో అహ్మ‌దాబాద్‌లోని మెహ‌తా ఆస్ప‌త్రికి కుటుంబ స‌భ్యులు త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించ‌డంతో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. విష‌యం తెలుసుకున్న ప్ర‌ధాని మోదీ హుటాహుటిన ఢిల్లీ నుంచి గుజ‌రాత్‌కు బ‌య‌లుదేరారు. హీరాబెన్ మృతి ప‌ట్ల ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ఇటీవ‌లే హీరాబెన్ వంద‌వ పుట్టిన రోజును జ‌రుపుకున్నారు. ఆమె గాంధీన‌గ‌ర్ శివార్ల‌లోని రైస‌న్ గ్రామంలో చిన్న కొడుకు పంక‌జ్ మోదీతో క‌లిసి ఉంటున్నారు. తాను అందుకున్న విజ‌యాల వెనుక త‌న త‌ల్లి హీరాబెన్ ఉంద‌ని ఎప్పుడూ ప్ర‌ధాని మోదీ చెబుతుంటారు. ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ త‌న యోగ‌క్షేమాలు తెలుసుకునేవారు. ఇటీవ‌ల గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓటు వేయ‌డానికి వ‌చ్చిన మోదీ అమ్మ ఆశీస్సులు తీసుకున్న త‌రువాత‌నే ఓటు వేసేందుకు వెళ్లారు.

త‌ల్లి మృతి చెంద‌డంతో ప్ర‌ధాని మోదీ భావోద్వేగానికి లోన‌య్యారు. "నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వ‌రుని చెంత‌కు చేరింది. ఆమె జీవిత ప్ర‌యాణం ఒక త‌పస్సు లాంటిది." అని ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు.


Next Story