కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో ఐదు రోజుల్లో ప్రారంభంకానుంది. దీని సన్నాహకాల్లో భాగంగానే దేశవ్యాప్తంగా డమ్మి వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇప్పటికే విజయవంతంగా నిర్వహించారు. వ్యాక్సిన్ తీసుకునేవారిని గుర్తించడంతో పాటు.. టీకా పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను చేశారు. దీంతో ఈ నెల 16వ తేదీ శనివారం నుంచి దేశంలో కరోనా వ్యాక్సిన్ మొదటి విడుత పంపిణీ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో వర్చువల్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సోమవారం సమావేశంకానున్నారు. ఈ భేటీలో టీకా పంపిణీకి ఏర్పాట్లు, విధివిధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎంలతో చర్చించనున్నారు. దేశంలో తయారైన భారత్ బయోటెక్‌కు సంబంధించిన కోవ్యాక్సిన్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తిచేస్తున్న కొవీషీల్డ్ టీకాలను అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి అనుమతించిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవడం ఇదే తొలిసారి.
ఇక కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియను కోవిన్ యాప్ ద్వారా సమన్వయం చేయనున్నారు. ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న 79 లక్షలకుపైగా వ్యాక్సిన్ లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయి. మొదటి దశలోఆరోగ్య కార్యకర్తలకు, తర్వాత పోలీసులు, భద్రతా సిబ్బందికి వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తారు. అనంతరం 50 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు.