పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యవసర వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులపై సమీక్షించేందుకు ఈ భేటీని ఏర్పాటు చేశారు.
యుద్ధ ప్రభావం వల్ల భవిష్యత్తులో తలెత్తే ఇంధన కొరత, ముడి చమురు ధరల పెరుగుదల మరియు అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినడం వల్ల కలిగే ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో రాష్ట్రాల సన్నద్ధతపై ప్రధానంగా చర్చించనున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రత, అవసరమైతే వారిని సురక్షితంగా స్వదేశానికి తరలించే అంశాలపై కూడా ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు.
అయితే, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కొంతమంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెంచడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం.