ఒకే వేదికపై కనపడనున్న ప్రధాని మోదీ, శరద్ పవార్, అజిత్ పవార్.. టైం కూడా ఫిక్సయింది..!
PM Modi Sharad Pawar And Ajit Pawar May Share Stage On August One In Pune. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయాయి.
By Medi Samrat
ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఒకవైపు శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య పార్టీ, గుర్తు విషయంలో యుద్ధం మొదలైంది. మరోవైపు, శివసేన పేరు, ఎన్నికల గుర్తుపై ఉద్ధవ్ ఠాక్రే వేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ విషయంలో షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేల మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో ఓ పెద్ద వార్త తెరపైకి వచ్చింది. ఆగస్టు 1న పూణేలో ఒకే వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, శరద్‌పవార్, అజిత్ పవార్‌లు కనపడనున్నారని నివేదికలు చెబుతున్నాయి.
ఆగస్టు 1న పుణెలో తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుతో సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శరద్ పవార్‌ని ఆహ్వానించారు. ఈ మేరకు నిర్వాహకులు సమాచారం అందించారు. దీనికి శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్‌ను కూడా ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆయనతో పాటు మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బాయిస్, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు ఇతర ఆహ్వానితుల్లో ఉన్నారు.
ఆగస్టు 1న లోకమాన్య తిలక్ 103వ వర్ధంతి సందర్భంగా తిలక్ మెమోరియల్ టెంపుల్ ట్రస్ట్ (హింద్ స్వరాజ్ సంఘ్) ప్రధానమంత్రిని గౌరవిస్తుందని ట్రస్ట్ అధ్యక్షుడు దీపక్ తిలక్ తెలిపారు. ప్రధాని మోదీ అత్యున్నత నాయకత్వానికి, దేశ పౌరులలో దేశభక్తిని పెంపొందించినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రిని జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో సత్కరించనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి అత్యున్నత నాయకత్వంలో.. స్వావలంబన భారత్ అనే భావనతో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందని ట్రస్ట్ ప్రకటన పేర్కొంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో తాజా మార్పుల తర్వాత.. ఆగస్టు 1న జరగనున్న ఈ కార్యక్రమం అందరి దృష్టి ఆకర్షించనుంది. జూలై 2న అజిత్ ఎన్డీయేలో చేరి రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామంతో శరద్ పవార్ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ఎన్సీపీ నేతల అవినీతి గురించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. దోషులపై చర్యలు తీసుకోవాలని పవార్ డిమాండ్ చేశారు. శరద్ పవార్ మాట్లాడుతూ.. 'ప్రధాని ఎన్‌సీపీని, ఆయన ఆరోపణలు చేసిన వారందరినీ నిర్దోషులుగా ప్రకటించినట్లు కనిపిస్తోంది. ఆయన తన ఎన్‌సీపీ సహచరులను మంత్రివర్గంలోకి తీసుకున్నందుకు ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. దీంతో అవినీతిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలింది. ఇందుకు నేను ఆయనకు కృతజ్ఞుడను అని వ్యాఖ్యానించారు.