ఈ రోజు వెలువడిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రభంజనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీ మెజార్టీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. యూపీతో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని భారతీయ జనతాపార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పాల్గొని ప్రసంగించారు.
హోలీ పండుగ ముందగానే వచ్చిందన్నారు. ప్రజల అఖండ మద్దతే ఈ విజయానికి కారణమని తెలిపారు. ఈ ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. బీజేపీ నిర్ణయాలు, విధానాలపై నమ్మకం పెరిగిందని, బీజేపీ స్థానాల సంఖ్య పెరిగిందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 37 ఏళ్ల తరువాత ఒక పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చింది. యూపీలో 2014 నుంచి అభివృద్దికే ప్రజలు ఓటు వేశారన్నారు. ఈ ఎన్నికలు చాలా సంక్లిష్ట సమయంలో జరిగాయన్నారు. కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ ఈ ఎన్నికలు వచ్చాయని.. అయినప్పటికి తాము తీసుకున్న చర్యల వల్ల కరోనా సంక్షోభం నుంచి బయటపడినట్లు వెల్లడించారు. రష్యా- ఉక్రెయిన్ వల్ల అంతర్జాతీయంగా చమురు, నూనెల ధరలు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్‌లో పంజాబ్‌లోనూ బీజేపీ జెండా ఎగురవేస్తుందని ఆకాంక్షించారు.